Kerala High Court: ఆసుపత్రులు “ఆధునిక సమాజంలోని దేవాలయాలు” అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ షరతుల్లో భాగంగా, నిందితుడు కోర్టుకు రూ. 10,000 డిపాజిట్ చేయాలని, ఒక వేళ నిర్దోషిగా తేలితే ఆ డబ్బులను తిరిగి పొందుతాడని, నేరం రుజువైతే ఈ మొత్తాన్ని ఆస్పత్రికి జరిగిన నష్టాన్ని భర్త ఉపయోగించబడుతుందని కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి ఇలాంటి షరతులను చేర్చేందుకు రాష్ట్ర శాసనసభ ‘‘కేరళ హెల్త్‌కేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ (హింస నిరోధం మరియు ఆస్తులకు నష్టం) చట్టం, 2012’’లో సవరణలు చేయాలని జస్టిస్ కున్హికృష్ణన్ సూచించారు.
Read Also: Violence against Hindus: పాకిస్తాన్‌లో కన్నా బంగ్లాదేశ్‌లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
ఆస్పత్రులు కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి ఆశకి, స్వస్థతకు చిహ్నాలని హైకోర్టు పేర్కొంది. అలాంటి ప్రదేశాల్లో ఏదైనా విధ్వంసం జరిగితే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని కోర్టు పేర్కొంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదా దుష్ప్రవర్తన కారణంగా ఆస్పత్రుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని హైకోర్టు అంగీకరించింది. ‘‘అంత మాత్రాన ఆస్పత్రి భవనం లేదా సామాగ్రిని నాశనం చేయలేమని చెప్పింది.
‘‘ఆసుపత్రులు ఆధునిక సమాజంలోని దేవాలయాలు, ఇక్కడికి ప్రజలు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం దేవతలను ఆరాధించడానికి వెళతారు. అందువల్ల ఆసుపత్రులలో ఏదైనా విధ్వంసాన్ని చట్టం యొక్క ఉక్కు హస్తాలను ఉపయోగించి నివారించాలి.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటు హైకోర్టు తన ఆదేశాల కాపీని కేరళ సీఎస్‌కి పంపాలని ఆదేశించడంతో పాటు ప్రభుత్వం తమ సూచనలకు అనుగుణంగా 2012 చట్టానికి సవరణలు చేయాలని కోరింది.