Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్‌లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్‌లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
రాజ్యసభకు మంత్రిత్వ శాఖ డేటాను సమర్పించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయమై బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు దేశాలకు లేఖలు రాసింది. వారి దేశాల్లో హిందువుల భద్రతను నిర్దారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. “ప్రభుత్వం ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో తన ఆందోళనలను పంచుకుంది. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని భారతదేశం అంచనా” అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Read Also: Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!
‘‘భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా మైనారిటీ వర్గాలపై హింసను లేవనెత్తుతుంది మరియు మత అసహనం, మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులను నిరోధించడానికి, వారి భద్రత, భద్రత, శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. పాకిస్తాన్‌లోని మైనారిటీల దుస్థితిని సముచితమైన అంతర్జాతీయ ఫోరమ్‌లో భారత్ హైలైట్ చేస్తూనే ఉంది’’ అని తెలిపింది.
డేటా ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 2022లో హిందువులపై 47 హింసాత్మక దాడులు నమోదవ్వగా, 2023లో 302, 2024లో 2200 దాడులు జరిగాయి. పాకిస్తాన్‌లో 2022లో 241, 2023లో 103, 2024లో 112 కేసులు నమోదయ్యాయి. మైనారిటీ, మానవ హక్కుల సంస్థల డేటాను ఉటంకిస్తూ, రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.