HMPV Virus: చైనాలో ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా మూడు కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ భయాల మధ్య టాప్ మెడికల్ బాడీ-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ‘‘సర్క్యులేషన్’’లో ఉందని సోమవారం హెచ్చరించింది.
అయితే, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను నిర్వహించడానికి భారత్ సిద్ధమైందని పేర్కొంది. ‘‘భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా HMPV ఇప్పటికే చెలామణిలో ఉంది. HMPVతో సంబంధం ఉన్న శ్వాసకోశ వ్యాధుల కేసులు వివిధ దేశాలలో నివేదించబడ్డాయి. ఇంకా, ICMR, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్‌వర్క్ ప్రస్తుత డేటా ఆధారంగా, దేశంలో ఇన్‌ఫ్లుఎంజా-లైక్ ఇల్‌నెస్ (ఐఎల్‌ఐ) లేదా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (ఎస్‌ఎఆర్‌ఐ) కేసుల్లో అసాధారణ పెరుగుదల లేదు’’ అని ఐసీఎంఆర్ తెలిపింది. అందుబాటులో అన్ని నిఘా మార్గాల ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తుందని, ఐసీఎంఆర్ ఏడాది పొడవునా వైరస్ ట్రెండ్స్‌ని ట్రాక్ చేస్తూనే ఉంటుందని కూడా పేర్కొంది.
Read Also: Kadiyam Srihari: దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
చైనాలో వైరస్ పెరుగుదల నేపథ్యంలో ఇతర శ్వాసకోశ వైరస్‌లను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇతర ఆరోగ్య సంస్థల ప్రతినిధులచే జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) ఏర్పాటైంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులకు మార్గదర్శకాలు జారీ చేశాయి. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మాస్క్ ధరించాలని సూచించారు.
HMPV అంటే ఏమిటి?
HMPV వైరస్ మొదటిసారి గా 2001లో కనుగొన్నారు. ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబంలో ఒక భాగం. సాధారణంగా వైరస్ కారణంగా దగ్గు, జ్వరం, ముక్కు మూసుకుపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో న్యూమోనియా, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులకు దారి తీస్తుంది. ఇది దగ్గు, తమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా తక్కువ వ్యాధినిరోధక శక్తి కలిగిన వృద్ధులు, పిల్లలు త్వరగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.