హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని జంగ్లా ప్రాంతంలోని సైంజ్ లోయలో ప్రైవేటు బస్సు పడింది. బస్సు లోయలో పడటంతో నుజ్జనుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 12 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో స్కూలు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. కులు నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలను చేపడుతున్నారు. కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
కులు బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉందని.. గాయపడిన వారు త్వరలగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనల స్థలంలో మొత్తం అధికార యంత్రాంగం ఉందని..గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.