పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో వణికిపోతున్నారు. భారత ఆర్మీని చూసినా కూడా మహిళలు, చిన్నారులు గజగజలాడిపోతున్నారు. నిన్నటి ఘటనతో ఒక విధమైన భీతావాహ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం కాశ్మీర్‌లో భద్రతా దళాలు మోహరించాయి. ఉగ్రమూకల కోసం జల్లెడ పడుతున్నాయి. మంగళవారం దాడి తర్వాత సమీపంలోనే ముష్కరులు నక్కి ఉంటారని భావిస్తున్నారు. దీంతో భద్రతా దళాలు వెతుకలాట ప్రారంభించాయి. మరోవైపు జమ్మూలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు నిర్వహించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack : ఉగ్రదాడి నుంచి కొద్దిలో తప్పించుకున్న సెలబ్రిటీ జంట
అంతేకాకుండా పాకిస్థాన్-భారత్ బోర్డర్‌లో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ వైమానిక దళాలు
సరిహద్దు వైపు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తం అయింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు టెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పాక్‌పై భారత్ ప్రతీకార దాడి చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు వెంటనే ఐడీఎఫ్ ప్రతీకార దాడి చేసింది. ఆ విధంగా భారత్ కూడా పాకిస్థాన్‌పై ప్రతీకార దాడి చేయాలంటూ డిమాండ్ వస్తోంది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack : క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. మహేశ్ బాబు, విజయ్..
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారు. యూఏఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు.
ఇది కూడా చదవండి: BJP MPs: ” ఇది పాకిస్థాన్ పనే” ఉగ్రవాద ఘటనపై బీజేపీ ఎంపీల రియాక్షన్..