Actor Darshan: కర్ణాటకలో రేణుకాస్వామి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అభిమానిని కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ తూగదీప, అతడి అనుచరులు దాడి చేసి హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్‌కి కర్ణాటక హైకోర్టు ఊరట కల్పించింది. దర్శన్ దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ఈ కేసుని ఏప్రిల్ 08కి వాయిదా వేసింది.
గతంలో, దర్శన్ బెంగళూర్ నుంచి సెషన్ కోర్టు పరిమితుల నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. సుప్రీంకోర్టు ఈ కేసుని పరిశీలిస్తున్నందున, తన క్లయింట్ ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని దర్శన్ తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఆరోగ్య కారణాలు చూపుతూ దర్శన్ బెయిల్ కోరాడని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రయాణించాలి అని అనుకుంటున్నాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, దర్శన్ దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి కోర్టు అనుమతించింది.
Read Also: Sleep Crisis: భారతీయులు సరిగా నిద్ర పోవడం లేదు.. ముంచుకొస్తున్న ‘‘నిద్ర సంక్షోభం’’
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకు ఫిబ్రవరి 25న బెంగళూర్ స్థానిక కోర్టుకు హాజరయ్యారు. అయితే, ఇతర నిందితులు తమను అప్రూవర్లుగా మారమని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు ఆరోపించబడుతున్న పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనను కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి చిత్ర హింసలు పెట్టి చంపారు. ఈ హత్య ఆరోపణలపై దర్శన్, పవిత్ర, మరో 15 మందిని జూన్ 11, 2024న అరెస్టు చేశారు. దర్శన్ 131 రోజులు కస్టడీలో గడిపిన తర్వాత అక్టోబర్ 30, 2024న జైలు నుండి విడుదలయ్యాడు.