Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు వస్తున్నట్లు ఆమె అభ్యర్థించారని ఈ రోజు రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. తమకు కొన్ని నిమిషాల ముందే ఆమె ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఢాకా నుంచి బంగ్లా ఆర్మీకి చెందిన C-130J ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో AJAX పేరుతో ఢాకా నుంచి టేకాఫ్ అయి, కోల్‌కతా మీదుగా ఢిల్లీకి సమీపంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హిండన్ ఎయిర్ బేస్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీల సురక్షిత కస్టడీలో ఉన్నారు.
Read Also: Bangladesh Violence: హిందువులే టార్గెట్.. బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల అరాచకం.. వీడియోలు వైరల్..
బంగ్లా ఆర్మీ హెలికాప్టర్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారత సరిహద్దు వద్ద అతి తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు మన రాడార్లు గుర్తించాయి. భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే విమానంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుని భారత్ రాడార్ వ్యవస్థ విమానంపై నిఘా పెంచింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రెండు రాఫెల్ యుద్ధవిమానాలను రక్షణగా పంపాయి. ‘‘ బంగ్లాదేశ్‌తో ఉన్న భారత సరిహద్దు నుండి 10 కిలోమీటర్ల దూరంలో AJAX1431 అనే కాల్ గుర్తుతో కూడిన C-130 ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారతదేశం పర్యవేక్షించడం ప్రారంభించింది మరియు అది ఢిల్లీ వైపు వెళుతోంది. బంగ్లాదేశ్ వైమానిక దళం విమానం సాయంత్రం 4 గంటలకు పాట్నాను దాటి యుపి-బీహార్ సరిహద్దుకు చేరుకుంది.’’ అని అధికారులు తెలిపారు.
సాయంత్రం 5:45 గంటలకు విమానం హిండన్ ఎయిర్ బేస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించబడింది మరియు బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని NSA అజిత్ దోవల్ రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. బీఎస్ఎఫ్‌తో సహా భారత ఆర్మీ అప్రమత్తమైంది. పరిస్థితిని అంచనా వేయడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇంటెల్ ఏజెన్సీ చీఫ్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ JO మాథ్యూతో సహా భారతదేశ అత్యున్నత భద్రతా అధికారులు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.