Massive Traffic Jams: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్తున్నారు. దీంతో కుంభమేళాకు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ ఎదురయ్యయాయి. వేలాది మంది భక్తులు రాత్రంతా హైవేపై గడపాల్సి వచ్చింది. బీహార్‌లో 35 కి.మీ ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం ససారంలోని రోహ్తాస్ జాతీయ రహదారిపై ట్రక్కులు, బస్సులు, కార్లు బారులు తీరాయి. ట్రాఫిక్ జామ్స్ పెరుగుతున్న నేపథ్యంలో యూపీ పోలీసలు ప్రయాగ్ రాజ్‌లోకి పెద్ద వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో ట్రాఫిక్ కదలిక ప్రారంభమైంది.
Read Also: YSR Congress Party: మాజీ సీఎం హోదాలో వైఎస్ జగన్ భద్రతపై అనుమానాలున్నాయి..
కుంభమేళాలో మొత్తం ఆరు పవిత్ర స్నానాల్లో 5వది అయిన మాఘ పౌర్ణమి ముందు ప్రయాగ్ రాజ్‌కి భారీగా భక్తులు వస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం మహా కుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. ఇది 300 కి.మీ వరకు ట్రాఫిక్ జామ్‌కి కారమైంది. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లోని అనేక జిల్లాలోని పోలీసులు ప్రయాగ్ రాజ్‌కి వెళ్లే వాహనాలను నిలిపేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే, ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీలను కలిపే ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. అయోధ్య నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తుడు తన బాధను పంచుకుంటూ.. ‘‘నిన్న రాత్రి నుంచి మేము 40 కి.మీ మాత్రమే ప్రయాణించాము. సాయంత్రం 7 గంటల నుంచి ట్రాఫిక్ లోనే ఉన్నాము. మా కారులోనే నిద్ర పోవాల్సి వచ్చింది.’’ అని చెప్పారు. మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. సాధారణంగా ఈ ప్రయాణానికి 4 గంటలు పడుతుంది, కానీ ఇప్పుడు దాదాపుగా 12 గంటల సమయం అవుతోందని చెప్పారు.