ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజులుగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ముందుకెళ్లే పరిస్థితి లేదు.. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. తిండి తిప్పలు లేవు. ఇలా నాలుగు రోజులుగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. బీహార్‌లోని కురిసిన భారీ వర్షాలు కారణంగా ఢిల్లీ-కోల్‌కతా హైవేపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శుక్రవారం బీహార్‌లోని రోహాస్త్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో జాతీయ రహదారి-19లోని వివిధ ప్రదేశాలు నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాలు ఆయా ప్రాంతాలకు మళ్లించారు. అయినా కూడా గత నాలుగు రోజులుగా బీహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా హైవేలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. బంపర్-టు-బంపర్ క్యూలో నిలిచి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి.. వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక నిత్యావసర వస్తువులతో ఉన్న వాహనాలు కంపుకొడుతున్నాయి. మరోవైపు మంచినీళ్లు, ఆహారం దొరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా సమస్య పరిష్కరించాలని వాహనదారులు వేడుకుంటున్నారు.

బీహార్‌లోని రోహ్తాస్ నుంచి దాదాపు 65 కి.మీ దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక రోడ్లపై ప్రతిచోట గుంతలు ఏర్పడ్డాయి. ఓ వైపు నీరు.. ఇంకోవైపు గుంతలతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు గంట గంటకు వాహనాల రద్దీ పెరుగుతోంది. కిలోమీటర్ దూరానికి కొన్ని గంటల సమయం పడుతున్నట్లు డ్రైవర్లు వాపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ట్రాఫిక్ క్లియరెన్స్‌కు స్థానిక అధికారులెవరూ సహకరించడం లేదని తెలుస్తోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు నిర్మాణ సంస్థ కూడా పట్టించుకోలేనట్లు సమాచారం. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. 24 గంటల్లో వాహనాలు ఐదు కిలోమీటర్లే వెళ్లగల్గుతున్నాయి.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర ప్రమాదం.. భారీ శబ్దాలతో పేలిన గ్యాస్ సిలిండర్లు
గత 30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినట్లు డ్రైవర్లు వాపోయారు. టోల్లు, రోడ్డు పన్నులు, ఇతర ఖర్చులు చెల్లించినప్పటికీ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినట్లు ఆవేదన చెందుతున్నారు. రోడ్డుపై అధికారులెవరూ కనిపించడం లేదని ట్రక్ డ్రైవర్ ప్రవీణ్ సింగ్ తెలిపాడు. ‘‘రెండు రోజులుగా ట్రాఫిక్ జామ్లలో చిక్కుకున్నాము. మేము ఆకలితో దాహంతో దయనీయ స్థితిలో ఉన్నాము. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి కూడా గంటలు పడుతోంది.’’ అని మరో ట్రక్ డ్రైవర్ సంజయ్ సింగ్ అన్నారు.
ఇక ట్రాఫిక్ జామ్ కారణంగా నిత్యావసర వస్తువుల రవాణా ఆగిపోయింది. అలాగే వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఆహార పదార్థాలు పాడైపోతున్నాయి. అలాగే పాదచారులు, అంబులెన్స్‌లు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం..