హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండగులు టార్గెట్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీకరించి అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఇదే సమయంలో ఒవైసీని టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. తన కారుకు దిగిన బుల్లెట్లకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు.
Read Also: బ్రేకింగ్: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మీరట్ పట్టణంలోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు ఒవైసీ.. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసదుద్దీన్ వాహనంపై దుండగులు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒవైసీ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరో వాహనంలో ఢిల్లీకి చేరుకున్నారు.. ముగ్గురు, నలుగురు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపారని.. మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని.. అనంతరం అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించారు.. అయితే, ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.. ఇక, ఆ తర్వాత.. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు మరియు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నాకు సమాచారం ఇచ్చారని కూడా తెలిపారు ఒవైసీ.. ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన హాపూర్ ఎస్పీ దీపక్.. కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు.. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని.. అతని సహచరుడు పారిపోయాడని వెల్లడించారు.. పారిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టాం.. ఈ ఘటనలో మరిన్ని వాస్తవాలు తెరపైకి వచ్చినప్పుడు అప్‌డేట్ ఇస్తామని.. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదు.. కాల్పులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా తనిఖీ చేస్తున్నామని తెలిపారు దీపక్ భుకర్.