Gyanvapi mosque case:వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయం గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. స్థానిక కోర్టు ఆదేశాలతో వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో ‘శివలింగం’ లాంటి నిర్మాణం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే దీనిపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) శివలింగ నిర్మాణానికి ఎలాంటి హాని జరగకుండా కార్బన్ డేటింగ్ నిర్వహించడానికి అనుమతించింది.
Read Also: Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. “కార్బన్ డేటింగ్”కి అనుమతి..
కేసు పూర్వాపరాలు:
వీడియో సర్వే తర్వాత బయటపడిన శివలింగాన్ని ముస్లిం సంఘాలు ఇది ఫౌంటెన్ అని చెబుతున్నాయి. కాగా, ఈ శివలింగం వయసును నిర్థారించేందుకు శాస్త్రీయ పరిశోధనల కోసం కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షాన న్యాయవాదులు వారాణాసి జిల్లా కోర్టును కోరారు. అయితే ఆ సమయంలో కోర్టు దీన్ని తిరస్కరించింది. ఆ తరువాత హిందూ పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు కార్బన్ డేటింగ్ కు ఒప్పుకుంది.
మసీదు కూడా కాశీవిశ్వనాథ కాంప్లెక్స్ లో భాగమే అని మసీదు గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీనికి మసీదు కమిటీ వ్యతిరేకించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదులో విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. అయితే గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదులాగే మథురలోని శ్రీకృష్ణ జన్మభూమితో పాటు కర్ణాటకలోని కొన్ని మసీదులు కూడా వివాదాల్లో ఉన్నాయి.