Gyanvapi-Kashi Vishwanath Temple: జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును బహిరంగపరచాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక హార్డ్ కాపీలను ఇరు వర్గాలతో పంచుకోవాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. డిసెంబర్ 19న ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతంలో సర్వే చేస్తోంది. ఏఎస్ఐ 1500 పేజీల సర్వే రిపోర్టును రెండు వర్గాలు జనవరి 25న పొందే అవకాశం ఉంది.
Read Also: Hanuman Team: సీఏం యోగిని కలిసిన హనుమాన్ టీమ్.. ఎందుకో తెలుసా?
హిందూ పక్షం తరుపున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ఈ రోజు కోర్టు రెండు వర్గాల వాదన విన్నది. ఏఎస్ఐ నివేదిక హార్డ్ కాపీని రెండు వర్గాలకు అందించేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని, ఏఎస్ఐ తన నివేదికను ఈమెయిల్ ద్వారా అందించడాన్ని వ్యతిరేకించిందని, దీంతో హార్డ్ కాపీని పొందడానికి ఇరు పక్షాలు అంగీకరించినట్లు వెల్లడించారు. దీనికి కొన్ని వారాల ముందు జ్ఞానవాపి మసీదు ‘వజుఖానా’ మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేయాలని కోరుతూ హిందూ మహిళ పిటిషన్లు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు ఆమోదించింది.
జ్ఞాన్వాపి-కాశీ విశ్వనాథ్ మందిర వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇది ఒకప్పుడు కాశీ విశ్వనాధ మందిరంలో భాగమే అని, ముస్లిం దురాక్రమణదారులు దాడి చేసి మసీదు నిర్మించారని హిందూ పక్షం వాదిస్తోంది. గతంలో ఈ మసీదులో కోర్టు ఆదేశాలతో వీడియో సర్వే జరిగింది. మసీదులోని వజుఖానా బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. దీన్ని హిందూపక్షం శివలింగంగా చెబుతుంటే.. మసీదు కమిటీ మాత్రం ఇది ఫౌంటెన్ అంటూ వివరణ ఇచ్చింది.