సుప్రీంకోర్ట్ లో జ్ఞానవాపీ విచారణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా జ్ఞానవాపీ మసీదు వ్యవహారం మారింది. రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో సుప్రీం కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని వారణాసిజిల్లా కోర్ట్ లోనే విచారించాలనే నిర్ణయంపై మొగ్గు చూపింది. జిల్లా జడ్జీ ఈ విచారణను చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. సీనియర్, అనుభవం ఉన్న జడ్జీ ఈ కేసును విచారిస్తారని సుప్రీం కోర్ట్ తీర్పును వెల్లడించింది. ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సివిల్ సూట్ కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, కేసును సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ వారణాసి నుండి జిల్లా జడ్జి వారణాసికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపీ మసీదు వెలుపల ఉన్న దేవతామూర్తుల పూజకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయడంతో వారణాసి కోర్ట్ మసీదును పూర్తిగా వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఇద్దరు కోర్ట్ కమీషనర్లను నియమించింది. ఇదిలా ఉంటే వీడియో సర్వే నిలపివేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసింది.
ఇదిలా ఉంటే జ్ఞానవాపీ మసీదును ఈనెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేస్తున్న సమయంలో ‘ వాజూఖానా’లో ఉన్న బావిలో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. శివలింగం దొరికన స్థలానికి భద్రత కల్పించాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. తాజాాగా ఈరోజు ( శుక్రవారం) జరిగిన వాదనల్లో కూడా గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీం కోర్ట్ మరోసారి వెల్లడించింది. వజూ కోసం వారణాసి కలెక్టర్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు 8 వారాల పాటు అమలులో ఉండనున్నాయి.