Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ నేతృత్వంలో పలు కీలక హోదాల్లో పని చేసిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించారు. మరో వైపు తాను బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ తరుణంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన మనసు మార్చుకుంటారా? లేదంటే మరో పార్టీలో చేరతారా? సొంత కుంపటి పెట్టబోతున్నారా? అసలు ఆయన తర్వాతి అడుగు ఏంటన్న దానిపై చర్చ మొదలైంది.
బీజేపీలో చేరకుండా.. జమ్మూకశ్మీర్‌లో సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆజాద్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఇతర పార్టీలతో కలిసి ఆజాద్ అధికారం పంచుకునే యోచనలో లేనట్లు తెలుస్తోంది.
Ghulam Nabi Azad: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్
ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించారని, కానీ సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ నాశనం చేసినట్లు ఆరోపించారు. రాహుల్‌లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ మీడియా ముందే బహిరంగంగా చింపివేసినట్లు వెల్లడించారు. చిన్నపిల్లాడి మనస్తత్వంతో వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వ అధికారాల్ని చిన్నచూపు చూసినట్లు విమర్శించారు. 2014లో యూపీఏ ప్రభుత్వం ఓటమి చెందడానికి అది ప్రధాన కారణమైనట్లు ఆజాద్ ఆరోపించారు.
2014 నుంచి రెండు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయినట్లు గులాం నబీ ఆజాద్ అన్నారు. చాలా అవమానకర రీతి ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. 2014 నుంచి 2022 వరకు జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎన్నికల్లో ఓడిపోయినట్లు ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు నెగ్గిందని, ఓ ఆరు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లు ఆజాద్ తన లేఖలో చెప్పారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఏలుతోందని, మరో రెండు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి హుటాహుటిన రాజీనామా చేశారని, పార్టీలోని సీనియర్ నేతల్ని అవమానించారని ఆజాద్ అన్నారు. సోనియా గాంధీ పార్టీ అధినేతగా ఉన్నా.. అన్ని కీలక నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ లేదా సెక్యూరిటీ గార్డులు, లేదా పీఏలు తీసుకుంటున్నట్లు విమర్శించారు.
సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరమని హస్తం పార్టీ వ్యాఖ్యానించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత విద్వేషాలపై కాషాయ పార్టీ లక్ష్యంగా సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతున్న సమయంలో ఇలా జరగడం విచారకరమని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. ఇక సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.