Modi surname Case: ‘మోడీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీకి భారీ షాక్ ఇచ్చింది గుజరాత్ హైకోర్టు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ స్టే విధించడానికి నిరాకరించింది. గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని, ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సి అవసరం లేదని హైకోర్టు సింగిల్ బెంజ్ సమర్థించింది. దీంతో రాహుల్ గాంధీ దరఖాస్తును కొట్టివేసింది. రాహుల్ గాంధీపై కనీసం 10 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని కోర్టు పేర్కొంది.
2019 ఎన్నికల సమయంలో కర్ణాటకల కోలార్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యల చేశారు. మోడీ ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధికి రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడితే ఆటోమెటిక్ గా అతను పదవికి అనర్హుడు అవుతాడు. ఈ నిబంధనల కింద పార్లమెంట్ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది. దీంతో వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన అనర్హుడయ్యారు.