Neet Exam: నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. జూలై 17న కొల్లాం జిల్లా ఆయుర్‌లో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులు అవమానానికి గురయ్యారు. మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది అమ్మాయిల లోదుస్తులు విప్పించారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రా తీసి వెళ్లాలంటూ ఆదేశించారు. ఈ ఘటనపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల లో దుస్తులు తొలగించడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరీక్ష జరిగిన కళాశాల సిబ్బంది ఇద్దరు సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
Read Also: Atal Bridge: అటల్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ.
ఈ ఘటనకు సంబంధించి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చాయి. మరోవైపు ఈ విషయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వరకు వెళ్లింది. ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని వేసి విచారణ చేపట్టింది. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత విద్యార్థినులకు సెప్టెంబర్ 4న తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అటు నీట్ యూజీ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ వెల్లడించింది. నీట్ యూజీ ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 30 నాటికి neet.nta.nic.in వెబ్‌సైట్‌లో ఆన్సర్ ‘కీ’తో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ స్కాన్డ్ ఇమేజెస్, రికార్డెడ్ రెస్పాన్స్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.