Ghulam Nabi Azad comments on congress party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ ఈ రోజు జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆజాద్ మద్దతుదారులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా మెగా ర్యాలీ నిర్వహించారు ఆజాద్. సుమారు 20,000 మంది మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఏకంగా 40కి పైగా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి, పలువురు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.
ర్యాలీలో ఆజాద్, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మరోసారి విరుచుకుపడ్డారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మన రక్తంతో తయారైందని.. కంప్యూటర్లు, ట్విట్టర్లతో కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలు మన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ వారి పరిధి కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితైందని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని ఆజాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదని అందుకే ఎదగలేకపోతోందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బస్సుల్లో జైళ్లకు వెళ్లి, తమ పేర్లను డీజీపీ, పోలీస్ కమిషన్లకు పేర్లను రాసిచ్చి గంటలోనే విడుదల అవుతున్నారని.. కాంగ్రెస్ ఎదగకపోవడానికి కారణం ఇదే అని ఆయన విమర్శించారు.
Read Also: Bangladesh PM Sheikh Hasina: ఇండియా మా మిత్రదేశం.. బంగ్లాదేశ్‌కు శ్రీలంక పరిస్థితి రాదు
కొత్త పార్టీకి పేరును నిర్ణయించలేదని.. జమ్మూ కాశ్మీర్ ప్రజలే పార్టీ జెండాను, ఎజెండాను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అందరికీ అర్థమయ్యేలా నా పార్టీకి హిందూస్థానీ పేరు పెడతా అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు పూర్తిస్థాయిలో రాష్ట్రహోదాతో పాటు భూమిపై హక్కు, స్థానికులకు నివాసాలు, ఉపాధి కల్పించడంపై నా దృష్టిని కేంద్రీకరిస్తానని గులాం నబీ ఆజాద్ అన్నారు.