Congress: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితిలోకి కాశ్మీర్ సమస్యను తీసుకుపోవడం వంటి ఈ రెండు తప్పులు కాశ్మీర్ వివాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023, రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను ఆయన నిన్న లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Meftal: పెయిన్‌కిల్లర్ “మెఫ్టాల్”పై కేంద్రం కీలక హెచ్చరికలు..
అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల లోపూ పీఓకేను తిరిగి తీసుకురావాలని, మొత్తం భారతదేశంలోని అన్ని ఓట్లను మీరే పొందండి అంటూ గురువారం సెటైర్లు వేశారు. ‘‘ అమిత్ షా చెబుతున్నట్లు నెహ్రూ తప్పు చేశారనుకుందాం, 2019లో పీఓకేని వెనక్కి తీసుకువస్తామని చెప్పారు కాబట్టి పీఓకే తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు..? పీఓకే నుంచి ఒక్క యాపిల్ అయినా తీసుకురండి. పెద్దగా మాట్లాడుతారు కానీ ఏమీ చేయరు. పీఓకేలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) నిర్మాణ జరుగుతోంది. దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? 2024 ఎన్నికల ముందు పీఓకేని తీసుకురండి, భారతదేశంలోని ఓట్లన్నీ మీకే పడుతాయి’’ అని అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధిర్ రంజన్ చౌదరి.
ఈ దేశ భూభాగాన్ని కోల్పోవడం చారిత్రాత్మక తప్పిదమని అమిత్ షా నిన్న అన్నారు. 1947 యుద్ధంలో మూడు రోజుల తర్వాత కాల్పుల విరమణ జరిగి ఉంటే ఇప్పడు పీఓకే భారత్‌లో అంతర్భాగంగా ఉండేదని, మన అంతర్గత విషయాన్ని నెహ్రూ యూఎన్‌కి తీసుకెళ్లారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.