PM Modi: బెంగళూర్ నీటి సంక్షోభాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా బెంగళూర్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగర వాసులకు అవసరమైన రోజూ వారీ నీటిలో సగం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు కూడా అందుబాటులో లేదు. ఈ పరిస్థితిపై ప్రధాని మోడీ ఈ రోజు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..
‘‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చింది.’’ అని దుయ్యబట్టారు. నగరాన్ని ట్యాంకర్ మాఫియాకు వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రైవేట్ రంగానికి వ్యతిరేకం, పన్ను చెల్లింపుదారులకు వ్యతిరేకం, సంపద సృష్టికి వ్యతిరేకం, కేవలం ఇండియా కూటమి మోడీపైనే ఫోకస్ చేస్తుంది, కానీ నా ఫోకస్ మొత్తం ఇండియా అభివృద్ధి పైన, గ్లోబల్ ఇమేజ్‌పై ఉందని ప్రధాని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు అరిగిపోయిన టేప్ రికార్డర్‌తో తిరుగుతున్నారని, ఎన్డీయే నేతలు మాత్రం ట్రాక్ రికార్డ్‌తో తిరుగుతున్నారని, అందుకే మీ ఆశీర్వాదం కోసం బెంగళూర్ వచ్చానని మోడీ చెప్పారు.
బీజేపీకి దక్షిణాదిలో ఎంతో కీలకమైన కర్ణాటక రాష్ట్రంలో ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. బెంగళూర్ రూరల్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్ , బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, సెంట్రల్ నుంచి పీసీ మోహన్ అభ్యర్థులు. బెంగళూరు నార్త్ నుంచి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పోటీ చేస్తున్నారు. ఈ సారి బీజేపీ-జేడీఎస్ కూటమి ఉమ్మడిగా కర్ణాటకలో పోటీ చేస్తోంది.