ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. భారీగా వర్షాలు పడుతున్న అసోంలో మరో 9 మంది మరణించగా వరదల ధాటికి.. రాష్ట్రం మొత్తం చనిపోయిన వారి సంఖ్య 55కు చేరింది. 28 రాష్ట్రాల్లోని దాదాపు 19 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర, బరాక్ వాటి ఉపనదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడికి లోయర్ అసోంలోని పలు ప్రాంతాలు మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.అసోంలోని సోనిత్పుర్లోనూ వరదలు పోటెత్తుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో నదుల కట్టలు తెగిపోతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర గణాంకాల ప్రకారం 2930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 43,338 హెక్టార్ల మేర పంట మునిగిపోయింది. వరదల ధాటికి ఒక్క అసోంలోనే ఇప్పటివరకు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 లక్షల మందికిపైగా తీవ్ర ప్రభావం చూపింది.రాజధాని గువాహటిలో 373 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా.. లక్ష మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క బజలి జిల్లాలోనే 3 లక్షల 50 వేలమంది కిపైగా వరద బాధితులుగా మారారు.
వరద సహాయక చర్యల్లో భారత సైన్యం కూడా సేవలందిస్తోంది. ఆయా జిల్లాల అధికారుల విజ్ఞప్తి మేరకు గురువారం నుంచి సహాయచర్యల్లో భాగం పంచుకుంటోంది. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లోనూ పరిస్థితులు అసోం కంటే భిన్నంగా ఏం లేవు. పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడగా.. రోడ్లు ధ్వంసమయ్యాయి. మేఘాలయలో 18 మంది చనిపోయారు.మేఘాలయలోని చిరపుంజిలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 972 మి.లీ. వర్షపాతం నమోదైంది. మౌసిన్రామ్లో 1003.6 మి.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు
మనుషులు సహా మూగజీవులు కూడా వరదల ధాటికి ఇబ్బందులు పడుతున్నాయి. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వరదల్లో వెదురుబొంగులు ఇతరత్రా వాటిని పడవలుగా మార్చుకొని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
India Corona: దేశంలో కరోనా కల్లోలం.. వరుసగా మూడోరోజు 12వేలకు పైగానే..