అస్సాంలో దారుణం జరిగింది. నకిలీ బిల్లులు క్లియర్ చేసే విషయంలో పై అధికారుల నుంచి అధిక ఒత్తిడి రావడంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PwD)లో అసిస్టెంట్ ఇంజనీర్(30)గా పని చేస్తున్న మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం తన అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సహోద్యోగుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించింది. ఈ మేరకు ఒక సూసైడ్ నోట్‌ను రాసిపెట్టింది. తన చావుకు ఇద్దరు సీనియర్ అధికారులే కారణమని స్పష్టం చేసింది.
‘‘పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆఫీసులో తనకు మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేరు. నేను అలసిపోయాను. ఎక్కడికీ వెళ్లలేను. నా తల్లిదండ్రులు నా గురించి ఆందోళన చెందుతున్నారు.’’ అని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారుల నిరంతర ఒత్తిడి కారణమే అని నోట్లో తెలిపింది.
ఇది కూడా చదవండి: Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 50 మంది దుర్మరణం
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సీరియస్ అయ్యారు. ఇద్దరు సీనియర్ అధికారుల పేర్లు బయటపెట్టడంతో దర్యాప్తునకు ఆదేశించారు. వివరణాత్మక దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: Kidney Stones Alert: వీటిని ఎక్కువ తింటున్నారా? అయితే కిడ్నీలలో రాళ్లు రావడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ..!
బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఇటీవల పదోన్నతి పొందిన సూపరింటెండెంట్ ఇంజనీర్, గతంలో బొంగైగావ్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసిన దినేష్ మేధి శర్మ, ప్రస్తుతం బొంగైగావ్‌లో పోస్ట్ చేయబడిన సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) అమీనుల్ ఇస్లాంలను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.