INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉంటామని భావించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విబేధాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. సీట్ల షేరింగ్‌లో కాంగ్రెస్ వైఖరిని నిందించాయి. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందా.? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఆప్ పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పెద్దగా స్పందించడం లేదు.
Read Also: Tamil Nadu: బీజేపీ ఓబీసీ లీడర్ హత్య.. కత్తితో పొడిచి చంపిన దుండగులు..
ఇదిలా ఉంటే, ఇండియా కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఇతర రాజకీయ పార్టీలో పొత్తు పెట్టుకోకుండా, మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఇండియా కూటమి మూడు సమావేశాలకు హాజరైన ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయం ఇండియా కూటమికి పెద్ద షాక్ అనే చెప్పాలి.
గత నెల అబ్దుల్లా సీట్ల షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ మనం దేశాన్ని రక్షించాలంటే, మనం విభేదాలను మరిచి దేశం గురించి ఆలోచించాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ ఇటీవల అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.