కరోనా దెబ్బతో ఏదైనా పనిచేసుకుందామన్న దొరకని పరిస్థితి.. వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరాని దుస్థితి.. ఖాళీగా ఉండలేక వ్యవసాయం చేద్దామంటే ఎద్దులు లేకపోవడం ఓవైపు అయితే.. మరోవైపు ట్రాక్టర్‌ను పెట్టి దున్నించడానికి డబ్బు కూడా లేదు.. ఈ సమయంలో.. ఆ రైతు మెదడుకు వినూత్నమైన ఆలోచన తట్టింది.. తన పాత సైకిల్‌తోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.. ఔరా..! అనిపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జరిగింది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా దెబ్బకు ఆదాయం లేక పోవడంతో వ్యవసాయ పనులకు సైకిల్ ను వాడాడు నాగరాజు అనే వ్యక్తి ఆ సైకిల్‌కు కర్రు బిగించి.. తాను లాగుతూ.. ఏడో తరగతి చదువుతోన్న తన కుమారుడితో కలిసి సేద్యం చేశాడు.. ఇక, చేనులో అయితే.. పలుగును తగిలించి వ్యవసాయ పనుల్లో సైకిల్‌ను వాడాడు.. ఆయనను పలకరిస్తే.. ట్రాక్టర్లు కోసం డబ్బును చెల్లించే పరిస్థితి లేదని, గత ఏడాది వేసిన పంట నష్టపోవడంతో అప్పులు కూడా చేశామని ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు. కాగా, వరుసగా పెరుగుతోన్న పెట్రో ధరలు.. వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. డీజిల్ ధరలు పెరిగిపోవడంతో.. ట్రాక్టర్ల యజమానులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.. దీంతో.. క్రమంగా వ్యవసాయం భారంగా మారిపోతోంది.