ఎమ్‌ఎస్‌పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్‌కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ఆమోదించిన విషయం తెల్సిందే.
ఎంఎస్‌పీ విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ అభ్యర్థుల పేర్ల జాబితాను రాబోయే రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని రైతు సంఘాలు వెల్లడించాయి. పంజాబ్‌కు చెందిన రైతు నాయకులు ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పేర్లను కమిటీ కోసం ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లన్నింటినీ ఆమోదించింది. డిసెంబర్ 4న ఆందోళన ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ మంగళవారం తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రైతు సంఘం డిసెంబర్ 1, 4 తేదీల్లో సమావేశం కానున్నట్టు తెలిపారు. హర్యానాకు చెందిన రైతు నాయకులు బుధవారం సీఎం మనోహర్‌లాల్‌తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా నిరసన తెలుపుతున్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం ఈ సమావేశంలో చర్చించనున్న కీలకాంశాలలో ఒకటిగా సత్నామ్ సింగ్ తెలిపారు. అంతే కాకుండా, ఆందోళనలో భాగమైన రైతులపై దాఖలైన అన్ని కేసుల ఉపసంహరణను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/యూటీలకు ఒక ప్రతిపాదనను పంపిందని తెలిపారు.