NTV Telugu Site icon

breaking: సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్‌, టెన్షన్‌..!

Explosives

Explosives

కేరళలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్​ ప్రకటించారు పోలీసులు.. ఈ మధ్యే వయనాడ్‌లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా, ఈ నేపథ్యంలో సీపీఎం కార్యాలయంపై దాడి జరగడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. గత రాత్రి అధికార సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరినట్టు పోలీసులు చెబుతున్నారు. రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న ఏకేజీ సెంటర్‌పై రాత్రి 11.30 గంటల సమయంలో మోటర్‌బైక్‌పై వచ్చిన వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ(ఎం) నాయకులు ఇది బాంబుల దాడిగా ఆరోపించారు. ఏకేజీ భవన్‌లో బస చేసిన కొందరు పార్టీ నేతలు భవనం వెలుపల శక్తివంతమైన పేలుడు వినిపించినట్లు చెప్పారు.

Read Also: Rupee falls: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ..

ఇక, అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాలను పరిశీలించారు. బాంబు స్క్వాడ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఏకేజీ సెంటర్‌లోని అధికారిక మీడియా గ్రూప్ ద్వారా సీపీఎం విడుదల చేసిన సీసీటీవీ విజువల్స్‌లో ఒక వ్యక్తి మోటర్‌బైక్‌పై ఘటనా స్థలానికి చేరుకుని భవనంపై “బాంబు” విసిరి అక్కడి నుండి పారిపోతున్నట్లు చూపించారు. పేలుడు పదార్థం ఏకేజీ సెంటర్‌లోని గోడకు తగిలింది.. అయితే, ఈ రెచ్చగొట్టే చర్య వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని.. సీపీఎం శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ఈపీ జయరాజన్‌ సూచించారు.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. మరోవైపు ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌, విద్యాశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి సహా పలువురు కేరళ మంత్రులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నగరంలో పలువురు సీపీఐ(ఎం) కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.. రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కాంగ్రెస్‌ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం తన నియోజకవర్గం వాయనాడ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.