నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా గాంధీని ఈనెల 8న హాజరు కావాలని కోరగా.. రాహుల్ గాంధీని అంతకన్నా ముందే జూన్ 5న హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి ఈడీ సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీ ఈడీ సమన్లకు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ కీలక నేత అభిషేక్ మను సింగ్వీ తెలిపారు. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందు వల్ల కొత్త తేదీని కోరే అవకాశం ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ పేపర్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయని అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు కింద సోనియా, రాహుల్ గాంధీ స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్ ప్రశ్నించింది. ఈడీ కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించడంపై ఆ సమయంలో లోక్ సభలో కాంగ్రెస్ విప్ మానిక్కం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బీజేపీ వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు.2013లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు నేషనల్ హెరాల్డ్ ను తొక్కేయడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించారని.. ప్రస్తుతం బీజేపీ ఆ పని చేస్తుందని విమర్శించారు.