PM Modi: కేంద్ర బడ్జెట్ 2024 సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.48.21 లక్షల కోట్లతో 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారతదేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ప్రధాని అన్నారు. ‘‘ ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత చేకూరుస్తుంది. ఇది గావ్, గరీబ్, కిసాన్ (గ్రామం, పేదలు, రైతులు) ప్రయోజనం పొందుతుంది. ఇది విద్య మరియు నైపుణ్యానికి కొత్త స్థాయిని ఇస్తుంది, యువతకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి కొత్త బలాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Harish Rao: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..
ఆర్థిక మంత్రి బడ్జపెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. ఇది ఉద్యోగాలకు ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. ఈ బడ్జెట్‌లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని, మహిళ నేతృత్వంలో అభివృద్ధికి, శ్రామిక శక్తిలో మహిళలకు మరింత భాగస్వామ్యానికి దోహదపడుతుందని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు మౌలిక సదుపాయాలపై పెట్టుబడిని పెంచినట్లు చెప్పారు.
రానున్న కొన్నేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అన్నారు. తూర్పు భారతదేశ సమగ్ర అభివృద్ధికి పూర్వి భారత్ అభివృద్ధి ప్రణాళిక అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి రూ. 1,000 కోట్లు, ఏంజెల్ పన్ను రద్దు, కొత్త శాటిలైట్ టౌన్‌ల సృష్టి, కొత్త రవాణా ప్రణాళికలు మొదలైనవి భారత్ అభివృద్ధి చెందిన దేశం వైపుకు తీసుకువెళతాయని, భారతదేశం అంతటా ఆర్థిక కేంద్రాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు. తాము ప్రతీ నగరం, పట్టణం, గ్రామం, ఇంటి స్థాయి నుంచి వ్యవస్థాపకుల్ని సృష్టించాలని, ప్రతీ ఇంలటి నుంచి ఓ పారిశ్రామికవేత్తలు ఉద్భవించాల్సిన అసవరం ఉందని, భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నామని ప్రధాని అన్నారు.