EC: బీజేపీ కర్ణాటక విభాగం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదమైంది. ముస్లింల రిజర్వేషన్లను ఉద్దేశిస్తూ బీజేపీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లిం కోటాను నిర్ణయించడాన్ని విమర్శిస్తూ, బీజేపీ ఓ యానిమేటెడ్ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం, ఆ తర్వాత అధిక నిధులను వారికే కేటాయించడాన్ని ఈ వీడియో చూపిస్తుంది. వీడియోలో ఉన్న వ్యక్తులను రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్యగా గుర్తించవచ్చు.
Read Also: Medical Scam: రూ.800 కోట్ల కుంభకోణంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడి పేరు..
ఈ పోస్టుపై కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కర్ణాటక చీఫ్ విజయేంద్ర, బీజేపీ ఐటీ హెచ్ అమిత్ మాల్వీయాపై కేసు నమోదైంది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ పోస్టును తొలగించాలని ఎక్స్‌ని కోరింది. ఇంతకుముందు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ ఈ పోస్టును పార్టీ తొలగించలేదు. రిజర్వేషన్లు, నిధుల విషయంలో కాంగ్రెస్ ఓబీసీల కన్నా ముస్లింలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ ఈ వీడియోను రూపొందించింది.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో ముస్లిం కోటా అంశం వివాదాస్పదమైంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీల కోటాను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోడీ ఆరోపిస్తున్నారు. మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని బీజేపీ విరుచుకుపడుతోంది. మరోవైపు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.