Man Swallowed 87 Cocaine Capsules, Arrested At Mumbai Airport: సూర్య నటించిన వీడొక్కడే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ సీన్ లో డ్రగ్స్ క్యాప్సుల్ లో ప్యాక్ చేసి మింగేసి కడుపులో దాచుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. అక్రమంగా భారత్ కు డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆఫ్రికా దేశం ఘనా నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ స్మగ్లింగ్ బయటకు వచ్చింది. ఆగస్టు 28న ఘనా నుంచి ముంబైకి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
దాదాపుగా 87 క్యాప్సూల్స్‌లో నిషేధిత డ్రగ్ కొకైన్ ను దాచి పెట్టి భారత్ కు తీసుకువచ్చాడు ఆఫ్రికా జాతీయుడు. ఈ క్యాప్సూల్స్ ని కడుపులో దాచుకున్నాడు. అయితే సదరు ప్రయాణికుడు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అతని వస్తువులను పరిశీలించగా.. ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. కానీ దర్యాప్తులో అతడు 87 క్యాప్యూల్స్ లో కొకైన్ ను దాచి మింగేసినట్లు గుర్తించారు.
Read Also: Tamilnadu: కూతురి పిండం అమ్మకానికి పెట్టిన కన్నతల్లి.. పెంపుడు తండ్రితో ఆ పని చేయించి..!!
తరువాత ఆస్పత్రికి తరలించి వ్యక్తి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 1300 గ్రాముల బరువున్న కొకైన్ విలువ రూ.13 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆస్పత్రికి తరలించిన వ్యక్తి నుంచి మూడు రోజుల పాటు కొకైన్ క్యాఫ్సూల్స్ ను బయటకు తీశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు.