Basavaraj Bommai: కర్ణాటక రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలుపై రగడ కొనసాగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయాలు చేయోద్దని సూచించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. దీనిపై విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని బొమ్మై హెచ్చరించారు. ‘‘విద్యావిధాన పాలసీలో చిన్న మార్పులు చేస్తే ఫర్వాలేదు కానీ.. సీఎం సిద్ధరామయ్య ఏకంగా రద్దు చేస్తాననడం అర్థరహితం… దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వారి జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదని బసవరాజ్ బొమ్మై అన్నారు. దేశంలోని ఎంతోమంది మేధావుల ఏళ్ల కృషితో జాతీయ విద్యావిధానాన్ని రూపొందించారని.. ఇది మైరుగైన విద్యా నిర్మాణమని.. విద్యార్థుల ఆసక్తి మేరకు సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగిస్తోందని చెప్పిన ఆయన.. అటువంటి విద్యావిధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ మూర్ఖత్వమని మండిపడ్డారు.
Read also: Mammu Kaka: మలయాళ సూపర్ స్టార్… పాన్ ఇండియా హారర్ సినిమా
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా ఖండించారు. నూతన విద్యావిధానం కర్ణాటకలో మాత్రమే అమలులో జరుగుతుందని.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు అమలు జరగడం లలేదని ప్రశ్నించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ హయంలో ఉన్న విద్యావిధానాన్ని డీకే శివకుమార్ ప్రశంసించారు. ప్రాథమిక విద్య, సాంకేతిక, ఉన్నత విద్య పరంగా ఎంతో ఉత్తమం అని కొనియాడారు. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందించిన నూతన విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని.. ఇది కేవలం బీజేపీ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని ఆరోపించారు.