ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఎప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, వ్యాక్సిన్ తీసుకుంటే.. ఏదో జరిగిపోతోందని.. చనిపోతున్నారని.. ఆస్పత్రి పాలవుతున్నారనే అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. వ్యాక్సినేషన్ తయారీ విధానంపై కూడా ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో అప్పుడే పుట్టిన లేగదూడ పిల్లల ద్రవాలను వినియోగిస్తున్నట్లు సోషల్ మీడియా హల్ చేస్తోంది.. కోవాగ్జిన్ కోసం ఆవులను చంపుతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ ఆరోపించడంతో వివాదం రాజుకోగా ఇది కాస్తా వైరల్‌గా మారిపోయింది.
అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. లేగదూడ ద్రవాలను వీరో కణాల అభృద్ధి కోసం వినియోగిస్తున్నారని.. వీరో కణాల అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఆవులు, ఇతర జంతువుల ద్రవాలను వినియోగిస్తున్నారని… వ్యాక్సిన్ల తయారీలో జీవకణాల అభివృద్ధి కోసం వీరో కణాలు వాడుతున్నారని.. ఇదే విధానాన్ని గత కొన్ని దశాబ్ధాలుగా వ్యాక్సిన్ తయారీలో పాటిస్తున్నారని స్పష్టం చేసింది కేంద్రం.. పోలియో, రేబిస్, ఇన్ ఫ్లుయంజా వ్యాక్సిన్లు కూడా ఇలాగే తయారవుతున్నాయని తెలిపింది.. ఇక, దూడల ద్రవాలను వేరుచేసే ప్రక్రియలో భాగంగా అనేకసార్లు వీరో కణాలను శుద్ధి చేస్తారని.. ఆ తర్వాతే వీరో కణాలతో కరోనా వైరస్ ను ఇన్ ఫెక్ట్ చేసి, వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారని.. ఇలా చేసే క్రమంలో వీరో కణాలను పూర్తిగా నాశనం చేసి, చనిపోయిన వైరస్ తోనే వ్యాక్సిన్ తయారవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. కానీ, కోవాగ్జిన్ లో లేగదూడ ద్రవం ఉందంటూ జరుగుతోన్న ప్రచారాలను నమ్మొద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన భారత్ బయోటెక్.. వ్యాక్సిన్ తయారీ కోసం లేగదూడలను చంపేస్తున్నామన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.