Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిని షరీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశీ అతడిపై కత్తితో దాడి చేసి, ఆరు చోట్ల గాయపరిచాడు. గాయపడిన సైఫ్‌ని వెంటనే సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అతడి వెన్నెముకలో ఇరుక్కుపోయిన కత్తిని తొలగించడానికి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నటుడు కోలుకున్నాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చర్చకు దారి తీసింది. ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బువా సైఫ్ అలీ ఖాన్ వైద్య ఖర్చులకు రూ. 25 లక్షల చెల్లించనున్నట్లు తెలిపింది. వైద్య కోసం సైఫ్ రూ. 36 లక్షల నగదు రహిత అభ్యర్థనను పెట్టగా, సంస్థ రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. నివా బుపా ముందస్తు అనుమతి అభ్యర్థననున అందుకున్నట్లు ధ్రువీకరించింది. మార్గదర్శకాల ప్రకారం తదుపరి ఇన్సురెన్స్ క్లెయిమ్స్‌ని ప్రాసెస్ చేస్తానని చెప్పింది.
అయితే ఈ వ్యవహారంపై ముంబైకి చెందిన వైద్య నిపుణుల సంస్థ ‘‘అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్’’ సైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ని ప్రశ్నించింది. సైఫ్ ఇన్సూరెన్స్‌ని త్వరగా ఆమోదించిన విధానాన్ని ప్రశ్నిస్తూ వైద్య నిపుణుల సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులరేటరీ సంస్థ అయిన ‘‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)’’కి లేఖ రాసింది.
‘‘మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ తన బీమా పాలసీ కింద నగదు రహిత చికిత్స కోసం రూ. 25 లక్షలు మంజూరు చేయబడ్డారనే ఇటీవలి వార్తల గురించి మా ఆందోళన మరియు అసంతృప్తిని వ్యక్తం చేయడానికి లేఖ రాస్తున్నాము. ఇది సాధారణ పాలసీదారులతో పోలిస్తే సైఫ్ అలీ ఖాన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది’’ అని చెప్పింది. ఇది సెలబ్రిటీలు, ఉన్నతస్థాయి వ్యక్తులు, కార్పొరేట్ పాలసీలు ఉన్న రోజులకు అనులకూమైన నిబంధనలు, అధిక నగదు రహిత చికిత్స పరిమితులను పొందుతున్నారని, అయితే సాధారణ పౌరులకు తగినంత కవరేజ్, తక్కువ రీఎయింబర్స్‌మెంట్ రేట్లతో ఇబ్బంది పడుతున్నారని వైద్యుల సంస్థ పేర్కొంది.
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇన్సూరెన్స్ సామాన్యులు, ఉన్నతులకు మధ్య అన్యాయమైన అసమానతలను సృష్టి్స్తోందని మెడికల్ కన్సల్టెటంట్స్ అసోసియేషన్ పేర్కొంది. సామాజిక హోదాతో సంబంధం లేకుండా బీమా అందరికి రక్షణగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అన్ని పాలసీదారులను సమానంగా చూసేలా చూసుకోవాలని సంస్థ IRDAIని అభ్యర్థించింది.