DK Shivakumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఆసక్తి కర్ణాటక ఎన్నికలపై నెలకొన్నాయి. కాంగ్రెస్ పతనావస్థకు అడ్డుకట్ట పడాలంటే.. కర్ణాటకలో ఖచ్చితంగా గెలిచితీరాలి. ఇక 2024లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి కర్ణాటక ఎన్నికలు చాలా కీలకం. మోదీ మానియా ఇంకా తిరుగులేదని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలంతా అభివృద్ధి వైపు సాగితే.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘భజరంగబలి’ జపం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతోంది.
Read Also: CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు
ఇటీవల కాంగ్రెస్ మానిఫెస్టోను విడుదల చేస్తూ.. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తాము అధికారంలోకి వస్తే ‘భజరంగ్ దళ్’ను నిషేధిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మానిఫెస్టోలో కూడా పెట్టారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు హిందూ సంఘాలు కూడా కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. మే 10న జరిగే ఎన్నికల్లో భజరంగబలి అని ప్రజలు ఓటేయాలని సూచించారు. ఈ హామీ వల్ల కాంగ్రెస్ కు మేలు జరగకపోగా.. రివర్స్ అయింది. తాజాగా గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ మాట్లాడుతూ.. భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రణాళిక లేదని చెప్పాల్సి వచ్చింది. ఇక డీకే శివకుమార్ తాము అధికారంలో వస్తే హనుమాన్ మందిరాలను నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కన్నడ నాట ఓ వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. డీకే శివకుమార్ హనుమాన్ ఆగ్రహానికి గురయ్యారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మానిఫెస్టో ప్రకటించిన రోజు, ప్రచార నిమిత్తం హెలికాప్టర్ లో బయలుదేరిన సమయంలో ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ముందరి అద్దం పగిలిపోయింది. పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత నిన్న గురువారం హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత కొద్ది దూరంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన అగ్నిమాపక శాఖ మంటల్ని ఆర్పేసింది. హొన్నవరంలో ఈ ప్రమాదం జరిగింది. గత మూడు రోజుల్లో శివకుమార్ రెండు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరస ఘటనలతో కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి.