No Phones In Classrooms: ప్రస్తుతం కాలంలో అన్ని దేశాల్లో తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడం పరిపాటిగా మారింది. విద్యపై దృష్టి సారించడం కన్నా క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నవారు కూడా ఉన్నారు. మన దేశంలో క్లాసురూముల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడంపై కాస్త కఠినంగానే వ్యవహరిస్తారు. కానీ యూరప్ దేశాల్లో మాత్రం ఇది సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడు ఓ ఓ యూరోపియన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.
Read Also: Russia: మాస్కోపై డ్రోన్ అటాక్.. అమెరికా, నాటో పనే అని రష్యా ఆరోపణలు..
తాజా విద్యా సంస్కరణల్లో భాగంగా నెదర్లాండ్స్ క్లాసురూముల్లోకి మొబైల్ ఫోన్లను నిషేధించింది. పాఠాలకు అంతరాయం కలిగించే మొబైల్ ఫోన్లను క్లాసురూముల్లోకి తీసుకురాకుండా నిషేధిస్తున్నామని అక్కడి ప్రభుత్వం మంగళవారం తెలిపింది. మొబైల్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలిగిస్తున్నాయని, వాటిని వచ్చే ఏడాది నుంచి తరగతిలోకి అనుమతించబోమని డచ్ ప్రభుత్వం తెలిపింది.
పాఠాలు చెప్పే సమయంలో మొబైల్ ఫోన్‌లు హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని.. వీటి వల్ల విద్యార్థులు ఏకాగ్రత తగ్గడంతో పాటు పనితీరు దెబ్బతింటోందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొబైల్ ఫోన్‌లు, అలాగే టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు ఇకపై జనవరి 1, 2024 నుండి తరగతి గదుల్లోకి అనుమతించబడవని ప్రకటించింది. అక్టోబర్ నాటికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అంతర్గత నిబంధనలను అంగీకరించాలని ప్రభుత్వ పాఠశాల అధికారులు కోరుతున్నారు. అయితే దేశంలోని రైట్ సంకీర్ణ ప్రభుత్వం అధికార నిషేధాన్ని విధించలేదు. వచ్చే ఏడాది ఫలితాలను బట్టి అధికార నిషేధాన్ని విధించే అవకాశం ఉంది. ఈ చర్య ‘‘సాంస్కృతిక పరివర్తన’’కు దారి తీస్తుందని.. విద్య అభ్యాసాన్ని మెరుగుపరుస్తుందని విద్యాశాఖ మంత్రి రాబర్ట్ డిజ్‌క్‌గ్రాఫ్ పార్లమెంటుకు తెలిపారు.