PM Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఆ సమాచారం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ వివరాలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లో గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డబ్బును డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
కోర్టు ఆర్డర్ పై స్పందిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘తమ ప్రధాని ఎంత చదువుకున్నాడో తెలుసుకునే హక్కు దేశానికి లేదా?, కోర్టులో అతని డిగ్రీని బహిర్గతం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకు?, డిగ్రీని చూడమని అడిగిన వ్యక్తికి జరిమానా విధించారు ఏం జరుగుతోంది? చదువుకోని లేదా తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం.” అని తన ట్వీట్ లో కామెంట్స్ చేశారు. 2016లో సమాచార హక్కు(ఆర్టీఐ) అభ్యర్థనపై స్పందించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రధాని మోదీ గ్యాడ్యుయేషన్, పోస్ట్ గ్యాడ్యుయేషన్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించింది.
Read Also: Poster War: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్..
అయితే ఈ ఉత్తర్వులను గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారని ఆయన ఎన్నిక నామినేషన్లు చెబుతున్నాయి. అయితే గత నెల ఈ కేసులో సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదిస్తూ.. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయమని యూనివర్సిటీని బలవంతం చేయరాదని కోర్టుకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఒక పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేటా.. నిరక్షరాస్యుడా..? అన్న తేడా ఉండదని, ఈ కేసులో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని, ఇది గోప్యతను ప్రభావితం చేస్తుందని ఆయన వాదించాడు. ఒకరి చైల్డిష్, బాధ్యతారాహిత్య అవసరాలను తీర్చడానికి సమాచారాన్ని కోరలేమని తుషార్ మెహతా అన్నారు.
ఎన్నికల నామినేషన్లలో ప్రధాని తన విద్యార్హతను పేర్కొన్నారని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది వాదించారు. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్స్ అడుగుతున్నాం, అతడి మార్క్ షీట్స్ కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ వార్ కు తెరలేపిన సమయంలో ఈ కేసులో తీర్పు వచ్చింది.