Delhi Woman Kidnaps Baby For Sacrifice To Bring Dead Father To Life: చనిపోయిన తన తండ్రిని బతికించేందుకు రెండు నెలల బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చే ప్రయత్నం చేసింది ఓ యువతి. పోలీసులు చాకచక్యంగా నిందితురాలిని పట్టుకుని ఆమె కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 25 ఏళ్ల నిందితురాలు శ్వేత గత కొన్ని నెలలుగా చిన్నారి కుటుంబాన్ని ఫాలో అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితురాలిని శనివారం పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు శ్వేతకు గతంలో రెండు దోపిడీలు, చోరీల కేసులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని గర్హి ప్రాంతంలో రెండు నెలల బాలుడు కిడ్నాప్ అయ్యాడని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఈ కేసును ఛేదించేందుకు సబ్ ఇన్స్పెక్టర్ రాజిందర్ సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు రవీందర్ గిరి, షేర్ సింగ్, సచిన్ సరోహా, నీరజ్ కుమార్, దినేష్ కుమార్, మహిళా కానిస్టేబుల్ పూనమ్లతో ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. ఈ టీంకి ఎస్హెచ్ఓ ప్రదీప్ రావత్ నేతృత్వం వహించారు.
Read Also: The Sun: సూర్యుడు ఎలా, ఎప్పుడు చనిపోబోతున్నాడో తెలుసా..? పరిశోధకులు అంచనాలు ఇవే..
అయితే గత కొన్ని నెలలుగా నిందితురాలు శ్వేత, పిల్లాడి కుటుంబాన్ని ఫాలో అవుతున్నట్లు తెలిసింది. కిడ్నాపర్ స్వేత తనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో మొదటిసారిగా కలిసిందని.. తను ఓ పిల్లల సంరక్షణ కోసం ఎన్జీవోగా పనిచేస్తున్నట్లు చెప్పిందని పిల్లాడి తల్లి చెప్పింది. తల్లిబిడ్డలకు ఉచితంగా వైద్యం అందిస్తామని శ్వేత హామీ ఇచ్చిందని.. ఆ తరువాత పలుమార్లు శిశువును పరీక్షించే నెపంతో గర్హిలోని తమ ఇంటికి వచ్చేదని తల్లి వెల్లడించింది.
ఇదిలా ఉంటే గురువారం, పిల్లాడిని బయటకు తీసుకెళ్లేందుకు అప్పగించాలని కోరింది. అయితే తల్లి తన 21 ఏళ్ల మేనకోడలు రితూను, శ్వేతతో కలిసి పంపింది. నిందితురాలు శ్వేత, రితూకు కూల్ డ్రింక్ ఇచ్చింది. కాగా అది తాగిన తర్వాత రితూ స్పృహ కోల్పోయింది. తరువాత శిశువు కిడ్నాప్ అయినట్లు తెలిసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తించారు. గురువారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో కోట్ల ముబారక్ పూర్ ఆర్యసమాజ్ మందిర్ వద్దకు వస్తారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు దాడి చేసి నిందితురాలి పట్టుకుని.. బాలుడిని సురక్షితంగా రక్షించారు. గత అక్టోబర్ లో శ్వేత తండ్రి చనిపోయాడు. అయితే బాలుడిని బలిస్తే తన తండ్రి తిరిగి వస్తాడనే మూఢనమ్మకంతో శిశువును బలిచ్చే ప్రయత్నం చేసింది. తల్లిని నమ్మించేందుకు కొన్నాళ్ల పాటు సాయం చేస్తున్నానే పేరుతో బాలుడి తల్లికి దగ్గరైందని పోలీసులు వెల్లడించారు.