ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది… గత మూడు రోజులుగా హస్తినను వీడడం లేదు వర్షాలు.. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 112 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత 12 ఏళ్లలో ఎన్నడూ ఇంత వర్షం పడలేదు. 2010 సెప్టెంబర్ 20న ఢిల్లీలో 110 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసింది. ఢిల్లీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ -NCR పరిధిలోని గురుగ్రామ్, మనేసర్, ఫరిదాబాద్, తోషమ్, భివాని, కోసలి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అక్బర్‌రోడ్డు, ఫిరోజ్‌షా రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో భారీ నీరు నిలిచింది. సౌత్ అవెన్యూ ప్రాంతం జలదిగ్భందంలో చిక్కుకుంది. అలాగే, లజపత్‌నగర్ మెట్రో స్టేషన్, లాలా లజ్‌పత్ రాయ్‌మార్క్, అరవిందో మార్గ్, జుంగుపురా మెట్రోస్టేషన్‌లోనూ వర్షపు నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో నడుము లోతు నీరు నిలిచిపోయింది. ఆ నీటిలో నుంచే ఆర్టీసీ బస్సులు ప్రయాణించాయి.
రోడ్లపై నీరు నిలవడంతో… ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామైంది. వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. వాహనాలు మొరాయించి మరికొందరు అవస్థలు పడ్డారు. మరోవైపు షాపుల్లోకి కూడా నీరు చేరడంతో… వాటిని తొలగించేందుకు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల చెట్లు కూడా కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఢిల్లీ జనపథ్ ప్రాంతంలో భారీ వర్షం నేలకూలడంతో… ఓ కారు ధ్వంసమైంది. అలాగే, ఓ భవనం గోడ దెబ్బతినింది. కుండపోత వానతో ఢిల్లీలో వాటర్‌ఫాల్స్ కూడా ఏర్పడాయి. ఫ్లైఓవర్ల పైనుంచి కిందకు నీరు జాలువారింది. దీంతో ఢిల్లీలో నయాగారా వాటర్ ఫాల్స్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్స్ పెట్టారు. ఢిల్లీ వర్షంపై నెటిజన్లు కామెంట్లు చేశారు. కొత్త రివర్ ఫ్రంట్ సర్వీసులు ప్రారంభమయ్యాయంటూ కొందరు, నడుములోతు నీటిలో ప్రయాణిస్తుంటే… బోటులో వెళ్తున్నట్టుందని ఇంకొందరు పోస్టులు పెట్టారు. ఢిల్లీ వీధుల్లో మీరు కూడా బోట్ రైడ్‌ను ప్రయత్నించారా అంటూ జోక్స్ వేశారు. ఢిల్లీలో కుండపోత వానలు కురుస్తుండడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ… ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.