Parliament Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన నిందితులకు మరో 15 రోజుల పాటు అంటే జనవరి 5 వరకు పోలీస్ కస్టడీ పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. స్పెషల్ జడ్జ్ హర్దీప్ కౌర్ నిందితులు కస్టడీని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం దేవీల కస్టడీని పెంచాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు మరో 15 రోజుల పాటు కస్టడీని పొడగించింది. గత వారం వీరికి కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. ఈ రోజుతో కస్టడీ ముగుస్తుండటంతో నిందితుల కస్టడీపై పోలీసులు అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్ల పూర్తయిన డిసెంబర్ 13 రోజునే నిందితులు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి దాడికి పాల్పడ్డారు. సాగర్ శర్మ, మనోరంజన్ విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ఎంట్రీ అయి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్ లోకి ప్రవేశించి, తమతో తెచ్చుకున్న పొగడబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు నిందితులు అమోల్ షిండే, నీలం దేవీలు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా ప్రవర్తించారు. వీరిని అక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు లలిత్ ఝా గత గురువారం పోలీసులు ముందు లొంగిపోయాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.