Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని.. 40 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.20 కోట్లకు కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆరోపించారు. మొత్తం 70 ఎమ్మెల్యేలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఎనమివది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్‌లను బీజేపీ నేతలు సంప్రదించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
Read Also: Ghulam Nabi Azad: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్
ప్రస్తుతం ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లో సీబీఐ విచారణ చేపడుతోంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇటీవల సిసోడియా ఇంటితో పాటు మొత్తం 20కి పైగా ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారంపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే ఆప్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది.
మద్యం స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా కూడా బీజేపీపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే, ఆప్ లో విభజన తీసుకువస్తే కేసులు మాఫీ చేయడంతో పాటు కీలక పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. నేను రాణా ప్రతాప్ వంశంలో పట్టానని.. తల నరికినా ధర్మం వైపే నిలబడా అని వ్యాఖ్యానించారు.