Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసింది. సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో సిసోడియా అరెస్ట్ కు మిస్సింగ్ ఫైల్స్ కారణం అని తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ విభాగంలో సీజ్ చేసిన ఓ డిజిటల్ డివైస్ సిసోడియా పాత్రను బయటపెట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో గతేడాది ఆగస్టు 19న సీబీఐ సోదాలు చేసింది. అయితే ఈ సమయంలో ఓ డిజిటల్ డివైస్ ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని పరిశీలించగా.. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని ఓ కంప్యూటర్ లో లిక్కర్ పాలసీకి చెందిన ఓ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఉన్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఈ కంప్యూటర్ గురించి కూపీలాగగా.. ఇది సిసోడియా ఆఫీసులోని సిస్టమ్ గా తేలింది. జనవరి 14న సిసోడియా ఆఫీసు నుంచి కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంప్యూటర్ లో చాలా వరకు ఫైళ్లు డిలీట్ అయినట్లు సీబీఐ అధికారు గుర్తించారు. ఫోరెన్సిక్ సాయంతో ఆ ఫైళ్లను రీట్రీవ్ చేశారు అధికారు. ఇందులో ఓ ఫైల్ పరిశీలించగా.. లిక్కర్ పాలసీకి సంబంధించిన ఓ ఫైల్ వాట్సాప్ ద్వారా పంపినట్లు తేలింది. సిసోడియా మాజీ సెక్రటరీని సీబీఐ ప్రశ్నించి, అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. 2021 మార్చిలో సిసోడియా తనను సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి పిలిచారని, అక్కడే మంత్రుల బృందం తయారు చేసిన డ్రాఫ్ట్ రిపోర్టు కాపీని తనకు ఇచ్చినట్లు, ఆ సమయంలో సత్యేంద్ర జైన్ కూడా అక్కడే ఉన్నట్లు అధికారి సీబీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది.
Read Also: CM Bhagwant Mann: అజ్నాలా హింసాకాండ పాకిస్తాన్ పనే..
లిక్కర్ పాలసీని ఎవరు రూపొందించారు..? ఎవరు ఆమోదించారు..? ఎలాంటి చర్చ జరిగింది..? 12 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఎలా వచ్చింది..? అనే కీలక ఫైళ్లు మిస్ అయినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. సిసోడియాను దీని గురించి ఎన్నిసార్లు అడిగినా.. సమాధానం దాటవేయడంతోనే అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
ఇదిలా ఉంటే డ్రాఫ్ట్ డాక్యుమెంట్ లో మార్పులకు సంబంధించిన ఆదేశాలు తనకు వాట్సాప్ ద్వారా అందాయని.. ఎక్సైజ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ఆ ఫోన్ నెంబర్ సిసోడియాదిగా మాజీ అధికారి వెల్లడించారు. 2022 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య సిసోడియా 18 ఫోన్లు, 4 సిమ్ కార్డులను వాడినట్లు సీబీఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. గతేడాది ఆగస్టు 19న సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది. దీని మరుసటి రోజు ఆయన ఒకే నెంబర్ పై మూడు ఫోన్లను మార్చినట్లు సీబీఐ పేర్కొంది.