Petrol Rates: ఇటీవల కాలంలో కేంద్రం పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర స్థిరంగా ఉండి, వచ్చే త్రైమాసికంలో కంపెనీలకు మంచి లాభాలు వస్తే పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించే అంశాన్ని ఆయిల్ కంపెనీలు పరిశీలించే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్ 2022 నుంచి పెట్రోల్,డిజిల్ ధరల్లో పెరుగుదల లేదని ఆయన అన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అయిన సందర్భంలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాఫెల్, ఇతర అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయన విదేశాల్లో పర్యటించినప్పడుు మైనారిటీల స్థితిగతులు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. 1983 నెల్లి ముస్లింల ఊచకోత మరియు 1984 సిక్కుల హత్యలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. మోడీ వెనక అద్ధంలో చూస్తూ భారత్ దేశం అనే కారును నడుపుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించిన నేపథ్యంలో.. హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ఆయన తన కంటి చూపును పరీక్షించుకోవాలని, ఆయన తప్పుడు అద్దాలు ధరించి ఉండవచ్చని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హాయంలో 10 ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని పూరి అన్నారు.
Read Also: Special story : గర్భగుడి వెనుక దండం పెడితే నిజంగా అద్భుతం జరుగుతుందా?
చమురు ధరల తగ్గింపు ఉందా..? అనే ప్రశ్నకు ఇప్పుడు తాను ప్రకటన చేసే స్థితిలో లేనని అన్నారు. రానున్న కాలంలో ఏం చేయాలో చూద్దాం అని అన్నారు. గత త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు మంచిగా ఫెర్ఫామ్ చేశాయని, వారు తమ నష్టాలలో కొంత భాగాన్ని పూడ్చుకున్నారని మంత్రి అన్నారు. ప్రతీ ఒక్కరు ఉచితాలను ఇష్టపడొచ్చని, కానీ ఇది దీర్ఘకాలంలో ప్రమాదంగా మారుతాయని హెచ్చరించారు. ప్రతిపక్షాలు ఉచితాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పలు బీజేపీయేతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకుండా, పెట్రోల్ ధరలు తగ్గించాలని మాట్లాడుతున్నారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాల పేర్లను ప్రస్తావంచుండా అక్కడ ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. దేశంలో ఆయిల్ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 252 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 400-450 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడానికి ప్రభుత్వం కృష్టి చేస్తుందని ఆయన అన్నారు. భారత వృద్ధి 5-5.5 శాతం ఉంటుందని అంచనా వేసిన మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై విమర్శలు గుప్పించారు. రాజన్ కోరుకునేది ఇదేనా..? అని ప్రశ్నించారు. భారత్ 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు.