Congress: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ మార్క్ చేరనీయ్యలేదని, తమకు ప్రతిపక్ష హోదా దక్కిందనే సంతోషం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం నిలవలేదు. వరసగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ, క్రెడిట్ అంతా జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) , సీఎం హేమంత్ సొరెన్‌కే దక్కింది. జార్ఖండ్‌లో ప్రాంతీయ పార్టీకి చిన్న భాగస్వామిగా కాంగ్రెస్ మిగిలింది.
ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)ని భేటీ నిర్వహించారు. పార్టీలో అంతర్గత తగాదాలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై ఖర్గే హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల పరాజయాలకు లోపాలను గుర్తించడానికి, జవాబుదారీతనం కోసం కఠిన నిర్ణయాలు అనివార్యమని పేర్కొన్నారు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 16 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది.
సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం, హర్యాన ఎన్నికల ఫలితాలు అన్ని అంచనాలకు విరుద్ధంగా వచ్చినట్లు అభివర్ణించింది. ఎన్నికల అక్రమాలు ఫలితాన్ని ప్రభావితం చేశాయని ఆరోపించారు. ఓటములపై పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్యానెల్ సభ్యులు రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పార్టీలో అంతర్గత వివాదాలపై ఖర్గే వ్యాఖ్యల్ని రాహుల్ గాంధీ సమర్థించారు.
Read Also: Maharashtra: ఇంకా తేలని మహారాష్ట్ర సీఎం.. హోం మినిస్ట్రీ పైనే శివసేన పంచాయతీ..
‘‘మనం ఐక్యంగా ఎన్నికల్లో పోరాడి, పరస్పరం వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం మానుకోకపోతే, రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎలా ఓడించగలం..?’’ అని ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక ప్రతిఘటన సంస్థ, పార్టీ నాయకులు దానిపై విశ్వాసం ఉంచాలని రాహుల్ గాంధీ కోరారు. సంస్థాగత బలహీనతలను పరిష్కరించడానికి మరియు మహారాష్ట్ర మరియు హర్యానాలో నష్టాలను అంచనా వేయడానికి రాష్ట్ర వారీగా సమగ్ర సమీక్షల ప్రణాళికలని ఖర్గే ప్రకటించారు. మహారాష్ట్ర, హర్యానాల్లో పర్యటించి స్థానిక నేతలతో మాట్లాడేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
‘‘పార్టీ తన నారేటివ్‌ని పటిష్టం చేస్తూనే ఉండాలి.. ఇందులో పూర్తి పూర్తి సామాజిక న్యాయం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు OBCలకు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించడం, రాజకీయ ప్రోత్సాహం. కులగణన, ఆర్థిక వ్యవస్థలో గుత్తాధిపత్యం, పెరుగుతున్న నిరుద్యోగం’’ వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియల్లో ఆందోళనల్ని పరిష్కరించడానికి ఇండియా కూటమి పార్టీల సహకారంతో దేశవ్యాప్తంగా ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలో ప్రజా మద్దతు కోసం ర్యాలీలు నిర్వహించనున్నట్లు కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.