COVID-19: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన రూపాలను మార్చుకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇటీవలే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా కోవిడ్ ఎమర్జెన్సీని ముగించింది. కోవిడ్ తో ప్రభావితం అయిన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి పలు దేశాలు లాక్డౌన్ల మార్గదర్శకాలను సడలించాయి.
Read Also: Nandamuri Balakrishna:సెట్ లో శ్రీలీల చెంప పగలకొట్టిన బాలయ్య..
ఇదిలా ఉంటే ఇప్పటికీ కోవిడ్ కారణంగా ప్రతీ 4 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. తక్కువగా టీకాలు వేసిన దేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిపింది. గతేడాది అమెరికాలో గుండె, కాన్సర్ జబ్బులతో సంభవించిన మరణాల తర్వాత మూడోస్థానంలో కోవిడ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల వరకు ప్రజల మరణాలకు కోవిడ్ కారణం అయింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది టీకా వేసుకోలేదు. రోగనిరోధకత లేకపోవడంతో 2021లో మూడు లక్షల కన్నా ఎక్కువ మంది అమెరికన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
కోవిడ్ నుంచి కోలుకున్నా కూడా లాంగ్ కోవిడ్ దాదాపుగా 10 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంచనా. 2022 చివరినాటికి లాంగ్ కోవిడ్ చికిత్స కోసం 50 బిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు UKలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్ గత సంవత్సరం అంచనా వేసింది.
లాంగ్ కోవిడ్ కారణంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, అలసట వంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. మాస్కులు పెద్దగా వినియోగించని ప్రాంతాల్లో మళ్లీ కోవిడ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే ఇమ్యునైజేషన్ ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.