ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరసగా కరోనా కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఫోర్త్ వేవ్ తప్పదా అనే భయాలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య 400 లను దాటుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కోవిడ్ రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత నాలుగు నెలల గరిష్టానికి కేసుల సంఖ్య చేరింది. నాలుగు నెలల్లో తొలిసారిగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం ఇండియాలో 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన రోజు వ్యవధిలో 39 మంది మహమ్మారి బారినపడి మరణించారు. 13,827 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఒక రోజు వ్యవధిలోనే 4000 కేసులు పెరిగాయి. బుధవారం 14,506 కేసులు నమోదు అయ్యాయి. డైలీ పాజిటివిటీ రేట్ 4.16 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.72గా ఉంది.
కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,28,22,493 మంది వ్యాధి బారినపడి రికవరీ అయ్యారు. 5,25,116 మంది మహమ్మారితో మరణించారు. దేశంలో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 1,97,61,91,554 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు. గడిచిన 24 గంటల్లో 14,17,217 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.