తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అటు చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని.. లేకుంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Read Also: Liquor Destroy: వేల లీటర్ల మద్యం ధ్వంసం.. ఘొల్లుమన్న లిక్కర్ లవర్స్
మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు మరింత ఉధృతికి దారితీయకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సీఎం స్టాలిన్ చెన్నై సచివాలయంలో వైద్యశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా కేసుల సంఖ్య ప్రబలకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా చేరకుండా నివారించాలని తెలిపారు. విద్యాసంస్థలు, కార్యాలయాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో తప్పనిసరిగా జ్వరం పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ సమావేశం అనంతరం టీబీ రహిత తమిళనాడు–2025 లక్ష్యంగా రూ.10.65 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన 23 డిజిటల్ ఎక్స్‌రే సంచార వాహనాల సేవలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు.