Woman Safely Delivers: శనివారం వేగంగా దూసుకెళ్తున్న రైలులో ఓ యువ వైద్యురాలు ఓ మహిళకు పురుడు పోసి అందరి మన్ననలు పొందింది. ఈ సంఘటనను మరవక ముందే తమిళనాడులో మరో మహిళ అర్ధరాత్రి నడిరోడ్డుపై పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సారి కాన్పు చేసింది వైద్యురాలు కాదు.. పోలీసు అధికారి. నిజమేనండి.. నిస్సహాయ స్థితిలో రోడ్డుపై నొప్పులతో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచింది ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్. కఠినంగా వ్యవహరించే పోలీసుల్లోనూ మానవత్వం ఉందని నిరూపించింది. అర్ధరాత్రి నడిరోడ్డుపై బిడ్డకు పురుడు పోసింది. ఈ సంఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది.
వేలూరులో సౌత్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా ఇళవరసి పని చేస్తోంది. ఈరోజు ఉదయం 1.30 సమయంలో ఇళవరసి నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిలో నుంచి నొప్పులతో విలపిస్తూ 30 ఏళ్ల షబానా కనిపించింది. చుట్టూ పక్కల ఎవరూ లేకపోవడంతో, అంబులెన్స్‌కు కాల్ చేసే పరిస్థితి చేయి దాటడంతో స్వయంగా మహిళకు హెడ్ కానిస్టేబుల్ ఇళవరసి పురుడు పోసి బిడ్డ ప్రాణాలు కాపాడింది. భర్త వదిలేయడంతో 10 ఏళ్ల కొడుకుతో కలిసి బస్టాండ్‌లో భిక్షాటన చేస్తూ షబానా జీవిస్తోంది. ఇతరు ఇచ్చే ఆహారంతో షబానా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. బిడ్డకు పురుడు పోసిన తర్వాత కానిస్టేబుల్ ఇళవరసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించింది. తల్లీబిడ్డలిద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. పురుడు పోసిన తర్వాత బిడ్డను చేతిలోకి తీసుకుని హెడ్ కానిస్టేబుల్ ఇళవరసి కన్నీటిపర్యంతమైంది. భావోద్వేగంతో ఆ బిడ్డను చూస్తూ ఉండిపోయింది.
Anushka Sharma: నా భర్తను చాలా మిస్సవుతున్నా.. అనుష్క ఎమోషనల్ పోస్ట్..
ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు కానిస్టేబుల్ ఇళవరసిని ప్రశంసలతో ముంచెత్తారు. పలువురు ప్రముఖులు ఇళవరసి చేసిన గొప్పపనికి ఆపద్భాందవురాలివంటూ కొనియాడుతున్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ట్రైన్‌లో ఓ యువడాక్టర్ బిడ్డకు పురుడు పోసి ప్రాణాలను కాపాడింది. ఆమెపై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది.