Congress: అహ్మదాబాద్ వేదికగా రేపు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరగబోతోంది. పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరుగుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ప్రియాంకా గాంధీపై నెలకొంది. ఆమెకు కీలక పాత్ర అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో సంస్థాగత వికేంద్రీకరణ, కూటమి నిర్వహణ, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వస్తున్న వేళ ప్రియాంకా గాంధీని ఎలా ఉపయోగించుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకోనుంది.
ప్రియాంకా గాంధీ వాద్రా ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహిస్తున్నారు. అయితే, ఆమెకు నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోని కేటాయించలేదు. దీంతో వివిధ రాష్ట్రాల యూనిట్లు, సీనియర్ నాయకులు ఆమె రాజకీయ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని, ఓటర్లతో కనెక్ట్ కావాలని పిలుపునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారాలు నిర్వహించారు. అయితే, పార్టీలో ఆమెకు ఖచ్చితమైన బాధ్యతలు లేవు.
Read Also: Chiken Biryani: వెజ్ బిర్యానీకి బదులు చికెన్ బిర్యానీ.. నవరాత్రి సమయంలో రెస్టారెంట్ నిర్వాకం..
వివిధ రాష్ట్రాల్లో ఓటమి తర్వాత, పార్టీ తనను తాను మార్చుకోవాలని భావిస్తోంది. 2027నాటికి గుజరాత్‌లో కీలకమైన రాజకీయ శక్తిగా, తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ఈ భేటీలో రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే పార్టీని నిలబెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. గతేడాది పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుందని, రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కొందరు పార్టీ నేతలు బీజేపీకి పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
మంగళవారం జరగబోయే సమావేశంలో పార్టీ వికేంద్రీకరణకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై వ్యతిరేక తీర్మానం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండియా కూటమి నిర్వహణ, సమిష్టిగా ప్రధాని మోడీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టనున్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కి అధ్యక్షుడి ఎన్నికైన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత గుజరాత్‌లో కాంగ్రెస్ జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొంటారని భావిస్తున్నారు.