రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మరొకసారి దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. డిసెంబర్ 24న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ‘‘బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్’’ నిర్వహించాలని పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు డిసెంబర్ 22, 23 తేదీల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
డిసెంబర్ 24న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మార్చ్ ప్రారంభించాలని, జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించేంత వరకూ మార్చ్ కొనసాగించాలని కేసీ.వేణుగోపాల్ సూచించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొంటారన్నారు.
డిసెంబర్ 18న రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.
పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి డైవర్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీలు దాడి అంటూ డ్రామాలాడారని ఆరోపించారు.