కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశవ్యాప్తం ఆందోళనకు సిద్ధం అవుతోంది. బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ నెల 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించనున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేపీ, కేంద్రప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గురువారం మరోసారి కాంగ్రెస్ ముఖ్య సమావేశం జరగనుంది. దీంట్లో ‘భారత్ జోడో యాత్ర’పై చర్చించనున్నారు. జూలై 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు.
Read Also: Zika Virus: మహారాష్ట్రలో మళ్లీ జికా వైరస్ కలకలం.. ఏడేళ్ల బాలికకు పాజిటివ్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ 5 రోజుల పాటు విచారించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్ లను విచారించింది ఈడీ. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గత నెల రాహుల్ గాంధీ విచారణ సందర్భంలో ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఇలాంటి వాటికి భయపడేది లేదని.. ఇలాంటివి ఎన్నో చూశామని అన్నారు.
జూన్ 8న సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిచింది.అయితే ఆమె కొవిడ్ బారిన పడటంతో సమయం కావాలని కోరారు. తాజాగా ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. మనీలాండరింగ్ చట్టం క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాంగ్మూలాలను నమోదు చేయాలని ఈడీ భావిస్తోంది.