Uniform Civil Code: కేంద్రం ఈ పార్లమెంటరీ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లు ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ ఈరోజు సమావేశం కానుంది. న్యూఢిల్లీలోని 10 జన్‌పథ్‌లోని ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో యూసీసీపై చర్చలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై చర్చించనున్నారు. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జూలై 3న యూసీసీపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోడీ నేతృత్వంలోని కమిటీ, కమిటీలోని 31 మంది ఎంపీలకు వారి అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపింది. సోమవారం జరిగే మీటింగ్ లో వీటిని పరిశీలిస్తామని తెలిపారు. పర్సనల్, పబ్లిక్ ఫిర్యాదులు, లా అండ్ జస్టిస్ కి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ అంశంపై లాకమిషన్, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వారి అభిప్రాయాలను తెలియజేయాలని జూన్ 14న నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు జూలై 3న లాకమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇందులో సభ్యుల అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలు చర్చించబోతున్నారు.
ఈ వారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం రెండు చట్టాలపై నడవదని, రాజ్యాంగం కూడా ప్రజలందరికీ సమాహ హక్కులు కల్పిస్తుందని, గతంలో యూసీసీని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఆయన అన్నారు. కొందరు యూసీసీ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే ద్రవ్యోల్భణం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రకటించారు. ఈ సమావేశాల్లోనే యూసీసీ బిల్లును కేంద్రం తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది.